రెచ్చిపోతున్న డ్రాగన్ కంట్రీ.. అరుణాచల్ ప్రదేశ్ లో వంద ఇళ్లతో చైనా గ్రామం.. ఇవిగో ఫొటోలు!

  • అమెరికా విదేశాంగ శాఖ నివేదిక
  • కాంగ్రెస్ కు నివేదిక సమర్పణ
  • టిబెట్, అరుణాచల్ మధ్య గ్రామాన్ని కట్టినట్టు వెల్లడి
డ్రాగన్ కంట్రీ చైనా రెచ్చిపోతోంది. మన సరిహద్దులు దాటి వస్తూ రెచ్చగొడుతోంది. తాజాగా వాస్తవాధీన రేఖను దాటేసి వచ్చి పచ్చని అడవులను చెదరగొట్టేసి అరుణాచల్ ప్రదేశ్ లో వంద ఇళ్లతో ఓ పెద్ద గ్రామాన్నే కట్టేసింది. ఈ వివరాలను అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన వార్షిక రక్షణ నివేదికలో వెల్లడించింది. ఆ నివేదికను కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు.

2020లో స్టాండాఫ్ సందర్భంగా చైనా సైన్యం భారత్ లోకి చొచ్చుకొచ్చిందని, టిబెట్, అరుణాచల్ మధ్య గ్రామాన్ని కట్టిందని పేర్కొంది. దీంతో భారత ప్రభుత్వంలో ఆందోళన నెలకొందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో ఉన్న షారి షూ నది ఒడ్డున ఆ గ్రామాన్ని కట్టినట్టు పేర్కొంది. ఆ ప్రాంతంపై భారత్, చైనా మధ్య 1962 యుద్ధానికి ముందు నుంచే గొడవలున్నాయని తెలిపింది.


దశాబ్ద కాలం పాటు ఓ చిన్న మిలటరీ అవుట్ పోస్టును ఏర్పాటు చేసుకున్న చైనా.. ఆ తర్వాత పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుందని, 2020లో ఓ పూర్తిస్థాయి గ్రామాన్ని నిర్మించుకుందని చెప్పింది. ఆ క్రమంలోనే రోడ్లు, ఇతర మౌలిక వసతులనూ ఏర్పాటు చేసుకున్నట్టు వెల్లడించింది. సరిహద్దుల్లో ఉన్న ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు చర్చలు జరుపుతూనే.. చైనా సైన్యం హద్దులు దాటేస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని అమెరికా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.


సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణాలను చైనా ఏర్పాటు చేస్తోందని, టిబెట్ నుంచి ఇక్కడిదాకా మౌలిక వసతుల కల్పన కోసం వేలాది కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని పేర్కొంది. అందులో భాగంగా 600 గ్రామాలను నిర్మించేసి, రోడ్లు, రైలు మార్గాలను ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోందని తెలిపింది.


నివేదికలో గాల్వాన్ లోయ ఘర్షణనూ అమెరికా పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నలుగురు చైనా సైనికులకు ఆ దేశ సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) మరణానంతర పురస్కారాలను ప్రకటించిందని, అసలు ఎంత మంది సైనికులు చనిపోయారో ఇప్పటికీ డ్రాగన్ కంట్రీ వెల్లడించలేదని పేర్కొంది.


More Telugu News