టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో

  • 2006లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీ20 అరంగేట్రం  
  • 18 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్న బ్రావో
  • సమయం వచ్చేసిందనే అనుకున్నానన్న ఆల్‌రౌండర్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించాడు. బ్రావో 2006లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీ20 అరంగేట్రం చేశాడు. 22.23 సగటు, 115.38 స్ట్రయిక్ రేట్‌తో 1,245 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల బ్రావో 78 వికెట్లు పడగొట్టాడు.  2012, 2016లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్లలో బ్రావో సభ్యుడు.

టీ20ల్లో అద్భుతమైన రికార్డు కలిగిన బ్రావో ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు 16 పరుగులు మాత్రమే చేసిన బ్రావో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. తన రిటైర్మెంట్ వార్తను ప్రకటిస్తూ.. ‘‘సమయం వచ్చేసిందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. దేశానికి 18 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించానని, ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని అన్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దేశానికి, ప్రజలకు ప్రాతినిధ్యం వహించినందుకు చాలా కృతజ్ఞుడినని పేర్కొన్నాడు.

మూడో కప్ కూడా గెలవాలని అనుకున్నామని, వాటిలో రెండు తన కెప్టెన్ (డారెన్ సామీ)తో కలిసి సాధించామని బ్రావో పేర్కొన్నాడు. ప్రస్తుత క్రికెటర్ల యుగంలో అంతర్జాతీయంగా మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోగలిగామని, ఇది చాలా గర్విస్తున్నానని చెప్పుకొచ్చాడు. కాగా, డిఫెండింగ్ చాంపియన్ అయిన విండీస్ ప్రదర్శన ఈసారి మాత్రం తేలిపోయింది. సూపర్ 12లో ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఓటమి పాలై సెమీస్ అవకాశాలను చేజార్చుకుంది.


More Telugu News