భూమ్మీదే కాదు... మరొక చోట కూడా నీరు ఉంది!

  • 12.88 బిలియన్ల కాంతిసంవత్సరాల దూరంలో నీరు
  • రెండు జంట గెలాక్సీల్లో నీటి జాడలు
  • గుర్తించిన అల్మా టెలిస్కోప్
  • ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లో అధ్యయనం ప్రచురణ
నీరు... హెచ్2ఓ... ఇది భూమిపై ఎంత పుష్కలంగా లభ్యమవుతుందో తెలిసిందే. జీవం విలసిల్లేందుకు అవసరమైన ప్రధాన వనరుల్లో ఇదొకటి. అనంత విశ్వంలో మనలాంటి గ్రహాలు ఉన్నాయేమోనని అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలు... మొదటగా  అక్కడ ఏమైనా నీటి ఆనవాళ్లు ఉన్నాయా? అని శోధిస్తారు. శాస్త్రవేత్తల పరిశోధనలు ఫలిస్తూ భూమికి 12.88 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఓ జంట గెలాక్సీ(SPT0311-58) ల్లో నీటి జాడ వెల్లడైంది.

అటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్ మిల్లీమీటర్ అర్రే (అల్మా) రేడియో టెలిస్కోప్ సదరు జోడు గెలాక్సీల్లో నీటిని గుర్తించింది. తొలిసారిగా దీనికి సంబంధించి 2017లోనే పరిశీలన చేసినా, శాస్త్రవేత్తలు తాజాగా మరింత నిర్ధారణకు వచ్చారు. విశ్వంలో హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ తర్వాత విస్తృతంగా దొరికే అణువుల్లో నీరు మూడోవది. కాగా, నీరు ఉందని భావిస్తున్న రెండు గెలాక్సీలు క్రమంగా ఏకమవుతున్నాయని అల్మా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అవి ఓ నక్షత్రంగా రూపాంతరం చెందుతున్నాయని వివరించారు. వాటిలోని నీరు... కార్బన్ మోనాక్సైడ్ అణువులతో కలిసి ఉందని పేర్కొన్నారు.

అపార పరిమాణంలో లభ్యమయ్యే ఈ రెండు పరమాణువులు శైశవదశలోని నక్షత్రాల్లో మరింత విస్తృతమయ్యాక, పరమాణు విశ్వానికి ఓ రూపు వచ్చినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన అధ్యయనం 'ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్' లో ప్రచురితమైంది. ఇప్పటివరకు గెలాక్సీల్లోని పరమాణు వాయువు, సుదూర గెలాక్సీల్లో నీటి జాడలకు సంబంధించి తాజా అధ్యయనమే అత్యంత వివరణాత్మకమైనదిగా భావిస్తున్నారు.


More Telugu News