అప్పు చెల్లించని కేసు విషయంలో... దాసరి నారాయణరావు కుమారుల‌కు కోర్టు నోటీసులు

  • రూ.2.11 కోట్లు అప్పు తీసుకున్న దాసరి అరుణ్, దాసరి ప్రభు
  • తిరిగి చెల్లించ‌ట్లేద‌ని గుంటూరు జిల్లాకు చెందిన సోమశేఖర్‌రావు పిటిష‌న్
  • ఈ నెల 15లోగా చెల్లించాల‌ని కోర్టు ఆదేశం
సిటీ సివిల్ కోర్టు సినీ దర్శకుడు దివంగ‌త‌ దాసరి నారాయణరావు నివాసానికి నోటీసులు పంపింది. దాస‌రి కుమారులు దాసరి అరుణ్, దాసరి ప్రభు వ్యాపార కార్య‌క‌లాపాల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్‌రావు అనే వ్య‌క్తి నుంచి రూ.2.11 కోట్లు తీసుకున్నారు. అయితే, ముందుగా చేసుకున్న‌ ఒప్పందం ప్రకారం ఆ డ‌బ్బును తిరిగి చెల్లించడంలో దాస‌రి కుమారులు జాప్యం చేస్తున్నార‌ని సోమశేఖర్‌రావు కోర్టులో ఇటీవ‌ల‌ పిటిషన్ వేశారు.

అంత‌కుముందు ఆయ‌న పోలీసు స్టేష‌న్ లోనూ ఫిర్యాదు చేశారు.  తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాల‌ని అడిగినందుకు తనను చంపుతామని దాసరి కుమారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవ‌ల కోర్టులో పిటిష‌న్ కూడా వేయ‌డంతో దీనిపై ఈ రోజు విచార‌ణ జ‌రిపిన‌ సిటీ సివిల్ కోర్టు   దాసరి ప్రభు, దాసరి అరుణ్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల‌  15లోగా డ‌బ్బు తిరిగి చెల్లించాల‌ని ఆదేశించింది.


More Telugu News