ఆఫ్ఘ‌న్‌లో విదేశీ క‌రెన్సీపై నిషేధం విధించిన తాలిబన్ ప్రభుత్వం!

  • విదేశీ క‌రెన్సీ వాడే వారిని శిక్షిస్తామ‌ని తాలిబ‌న్ల ప్ర‌క‌ట‌న‌
  • ఆఫ్ఘ‌న్‌ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వ్యాఖ్య‌
  • ఆఫ్ఘ‌న్ ఆర్థిక‌ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారే అవ‌కాశం
ఆప్ఘ‌నిస్థాన్‌లో తాలిబన్లు తీసుకుంటోన్న నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల‌ను మ‌రిన్ని క‌ష్టాలపాలు చేస్తున్నాయి. తాజాగా తాలిబ‌న్లు విదేశీ క‌రెన్సీపై నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం అక్కడి ప్రజలకు మరో కష్టమనే చెప్పాలి. ఆఫ్ఘ‌నిస్థాన్‌ ఆర్థిక వ్య‌వ‌స్థపై ఈ నిర్ణ‌యం తీవ్ర ప్ర‌భావం చూపనుంది. ఆఫ్ఘ‌న్‌లో వ్యాపారం కోసం విదేశీ క‌రెన్సీ వాడే వారిని శిక్షిస్తామ‌ని తాలిబ‌న్ల ప్ర‌తినిధి జ‌బియుల్లా ముజాహిద్ ప్రకటించారు.

ఆఫ్ఘ‌న్‌ ఆర్థిక పరిస్థితి, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా  ప్ర‌జ‌లు త‌మ‌ కరెన్సీలోనే లావాదేవాలు కొన‌సాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్ప‌టికే ఆఫ్ఘ‌న్ జాతీయ క‌రెన్సీ విలువ దారుణంగా ప‌త‌న‌మైన నేప‌థ్యంలో తాలిబ‌న్లు తీసుకుంటోన్న అనాలోచిత‌ నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల‌ను మ‌రిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.

మరోపక్క, ఆ దేశంలో విదేశీమార‌క నిలువ‌లు కూడా అడుగంటిపోయాయి. బ్యాంకుల్లో న‌గ‌దు సైతం క్ర‌మంగా త‌గ్గుతోంది. అలాగే, ప్ర‌పంచ దేశాలు ఆఫ్ఘ‌న్‌లోని తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌డం లేదు. ఆప్ఘ‌నిస్థాన్‌లో చాలా వ‌ర‌కు అమెరికా డాల‌ర్ల రూపంలో వాణిజ్యం న‌డుస్తుండ‌గా ఇప్పుడు దాన్ని నిషేధించారు.


More Telugu News