బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి: హుజూరాబాద్ ఫలితంపై హరీశ్ రావు స్పందన

  • ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పర్వం
  • విజేతగా నిలిచిన బీజేపీ అభ్యర్థి ఈటల
  • ఓటమితో కుంగిపోయేది లేదన్న హరీశ్ రావు
  • ఈటలకు శుభాకాంక్షలు తెలిపిన గెల్లు శ్రీనివాస్
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమితో పార్టీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడింది. దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. దేశంలో ఇలా కలవడం ఎక్కడా లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా వెల్లడించారని హరీశ్ రావు పేర్కొన్నారు.

జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందో అందరికీ తెలుసని, ఆ రెండు పార్టీలు నిత్యం కొట్లాడుతుంటాయని, కానీ హుజూరాబాద్ లో ఆ రెండు పార్టీలు ఎలా కలిసిపోయాయో ప్రజలు చూస్తున్నారని తెలిపారు. ఈ ఓటమితో తాము కుంగిపోవడంలేదని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్పందిస్తూ, హుజూరాబాద్ ఫలితం ఎలా ఉన్నా నైతిక విజయం మాత్రం తనదేనని అన్నారు. టీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులోనూ హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉండి ప్రజాసేవ చేస్తానని ఉద్ఘాటించారు. టీఆర్ఎస్ ఓటమి కోసం రెండు జాతీయపార్టీలు ఏకం అయ్యాయని గెల్లు కూడా ఆరోపించారు.

కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే గెల్లు శ్రీనివాస్ కంటతడిపెట్టారు. అయితే, వెంటనే తమాయించుకున్న ఆయన విజేతగా నిలిచిన ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.


More Telugu News