హుజూరాబాద్ ఓటమికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా: రేవంత్ రెడ్డి

  • హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు
  • డిపాజిట్ దక్కించుకోలేని కాంగ్రెస్ అభ్యర్థి
  • స్పందించిన రేవంత్ రెడ్డి
  • ఎవరూ నిరాశకు గురికావొద్దని సూచన
  • పార్టీలో సమీక్ష చేపడతామన్న రేవంత్   
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే పోరు నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి దరిదాపుల్లో ఎక్కడా కనపడలేదు. కనీసం డిపాజిట్ కు కూడా నోచుకోలేదు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

ఈ ఫలితం పట్ల ఎవరూ నిరాశ చెందవద్దని, అధైర్య పడాల్సిన పనిలేదని అన్నారు. వయసు రీత్యా తనకు ఇంకా 20 ఏళ్ల పాటు పార్టీని నడిపించే సత్తా ఉందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఓటమిపై పార్టీ నేతలతో చర్చిస్తానని వెల్లడించారు. వెంకట్ బల్మూరి ఈ ఓటమితో కుంగిపోవాల్సిన అవసరంలేదని, అతడికి పార్టీలో భవిష్యత్ ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు.

కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ ఉదాసీనంగా వ్యవహరించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు కొద్ది సమయం ఉందనగా అభ్యర్థిని ప్రకటించడం కూడా కాంగ్రెస్ వెనుకబాటుతనానికి కారణమైంది.


More Telugu News