కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్

  • పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
  • రాజీనామా లేఖను సోనియాకు పంపిన కెప్టెన్
  • సోనియా వైఖరి నచ్చలేదని తెగేసి చెప్పిన వైనం
  • రాహుల్, ప్రియాంక కూడా తనను బాధించారని వెల్లడి
పంజాబ్ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం పరాకాష్ఠకు చేరింది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (79) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వైఖరితో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్టు అమరీందర్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు సోనియాకు 7 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు.

సోనియాతో పాటు ఆమె సంతానం (రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) ప్రవర్తన తను తీవ్రంగా బాధించిందని వివరించారు. రాహుల్, ప్రియాంకలను తాను సొంతబిడ్డల్లా భావించానని, కానీ వారు తన పట్ల చూపిన వ్యతిరేకతను భరించలేకపోయానని అమరీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి తండ్రి రాజీవ్ గాంధీ, తాను 1954 నుంచి కలిసి చదువుకున్నామని, వారి కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు.

పంజాబ్ కాంగ్రెస్ లో ఇటీవల కాలంలో నెలకొన్న పరిణామాలతో అమరీందర్ సింగ్ సీఎం పదవికి సెప్టెంబరు 18న రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ గా ఉన్న నవజ్యోత్ సిద్ధూతో విభేదాలు తీవ్రరూపు దాల్చడంతో తనకు పార్టీ హైకమాండ్ నుంచి మద్దతు లేదని భావించిన అమరీందర్ సింగ్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. పార్టీలో ఎంతో సీనియర్ ని అయిన తనను కాదని, సిద్ధూకు పార్టీ అధినేతలు వంతపాడడం ఆయనను మరింత బాధించింది. ఈ నేపథ్యంలో పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

కాగా, అమరీందర్ సింగ్ భవిష్యత్ ఏంటన్నది ఆసక్తి కలిగిస్తోంది. తాను బీజేపీలో చేరనంటూ గతంలో ఆయన ప్రకటించారు. అయితే సొంత పార్టీ ఏర్పాటుకు ఆయన నిర్ణయించుకున్నట్టు భావిస్తున్నారు.


More Telugu News