ఆత్మగౌరవం విజయం సాధించింది.. తెలంగాణలో ఇక‌ టీఆర్ఎస్ ప‌ని అయిపోయింది: డీకే అరుణ‌

  • హుజూరాబాద్ నుంచే టీఆర్ఎస్‌ ప‌త‌నానికి నాంది
  • కేసీఆర్ అహంకారం, అణచివేతకు వ్య‌తిరేకంగా వ‌చ్చిన‌ ఫలితం ఇది
  • ఉప ఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ చేసిన మోసమే దళిత బంధు
  • ప్రజల నమ్మకాన్ని టీఆర్‌ఎస్ కోల్పోయింది
తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ దూసుకెళ్తుండ‌డం‌పై ఆ పార్టీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ పార్టీ నాయ‌కురాలు డీకే అరుణ స్పందిస్తూ.. ప్రతి రౌండ్ లో బీజేపీ ముందుందని, తెలంగాణలో టీఆర్ఎస్ ప‌త‌నం ప్రారంభమైందని అన్నారు.

హుజూరాబాద్ నుంచే టీఆర్ఎస్‌ ప‌త‌నానికి నాంది ప‌డుతుంద‌ని, కేసీఆర్ అహంకారం, అణచివేతకు వ్య‌తిరేకంగా వ‌చ్చిన‌ ఫలితం ఇదని డీకే అరుణ చెప్పారు. ఉప ఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ చేసిన మోసమే దళిత బంధు ప‌థ‌క‌మ‌ని డీకే అరుణ అన్నారు.

టీఆర్ఎస్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఆత్మగౌరవం విజయం సాధించిందని ఆమె చెప్పారు. దళితబంధు పథకాన్ని ప్రారంభించిన‌ గ్రామంలోనూ బీజేపీయే ముందంజలో ఉందని డీకే అరుణ గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని టీఆర్‌ఎస్ కోల్పోయిందని చెప్పారు. ఎన్నిక నేప‌థ్యంలో వేలకోట్ల రూపాయ‌ల‌ పథకాలకు జీఓలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదని ఆమె విమ‌ర్శించారు.

ఒక్కోఓటును 6 వేల నుంచి 10 వేలు రూపాయ‌లు పెట్టి కొనాల‌ని య‌త్నించిన‌ప్ప‌టికీ టీఆర్ఎస్ గెల‌వ‌లేద‌ని డీకే అరుణ అన్నారు. హుజూరాబాద్ ఓట‌ర్లు ఆత్మగౌరవం వైపే నిలబడ్డారని తెలిపారు. ఓట‌ర్ల‌కు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికార యంత్రాంగాన్ని మొత్తం వాడిన‌ప్ప‌టికీ గెల‌వ‌లేక‌పోతోందని తెలిపారు. ప్రజల తీర్పు చారిత్రాత్మకమైందని, టీఆర్ఎస్‌కు ఈ తీర్పు కనువిప్పని ఆమె అన్నారు.


More Telugu News