మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్

  • అరెస్టుకు ముందు 12 గంటలపాటు విచారించిన ఈడీ
  • రెస్టారెంట్లు, బార్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయమన్నట్టు ఆరోపణలు
  • ఆరోపణలు ఖండిస్తూ వీడియో విడుదల చేసిన మాజీ మంత్రి
  • ఇదే కేసులో ఆదివారం తొలి అరెస్ట్ చేసిన సీబీఐ
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌‌ (71) గత రాత్రి అరెస్టయ్యారు. అంతకుముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను 12 గంటలకుపైగా విచారించింది. అనంతరం అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గతంలో చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు, మాజీ మంత్రిపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇదే కేసులో సమన్లు జారీ చేసిన ఈడీ విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసింది. ఈడీ సమన్ల రద్దు కోరుతూ శుక్రవారం బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ మాజీ మంత్రికి నిరాశే ఎదురైంది.

ఇటీవల ఆయన ఆస్తులపైనా ఈడీ దాడి చేసి జప్తు చేసింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను అనిల్ దేశ్‌ముఖ్ నిన్న ఓ వీడియో ద్వారా ఖండించారు. తనపై ఆరోపణలు చేసిన పోలీసు అధికారి పరంబీర్ సింగ్ ఎక్కడ అని ప్రశ్నించారు. సొంత డిపార్ట్‌మెంట్ నుంచే కాకుండా పలువురు వ్యాపారవేత్తలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారని అన్నారు. కాగా, అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ ఆదివారం ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇదే తొలి అరెస్ట్.


More Telugu News