బద్వేలు ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం ఇదే!: సోము వీర్రాజు

  • బద్వేలు ఉప ఎన్నికలో అవినీతి, అరాచకం
  • దొంగ ఓటర్లు వ‌చ్చారు
  • పోలింగ్ బూత్ లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేసుకున్నారు
  • గుర్తించిన చోట రీ-పోలింగ్ పెట్టాల‌ని కోరాం 
బద్వేలు ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం కేవలం దొంగ ఓటర్లేన‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చెప్పారు. నిన్న బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో బ‌య‌టి వ్య‌క్తులు వ‌చ్చి ఓట్లు వేశార‌ని బీజేపీ ప‌లు వీడియోలు కూడా పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అలాగే, అధికారుల‌కు కూడా బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఆయా అంశాల‌పై సోము వీర్రాజు ట్విట్ట‌ర్ ద్వారా మ‌రోసారి స్పందించారు.

'బద్వేలు ఉపఎన్నికలో అవినీతి, అరాచక, కుటుంబ, రాచరిక పాలనకు వ్యతిరేకంగా, అభివృద్ధికి మ‌ద్ద‌తుగా నిజాయితీగా ఓట్లు వేసిన ఓటరు మహాశయులందరికీ భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తోంది' అని సోము వీర్రాజు చెప్పారు.
 
'బద్వేలు ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగటానికి కారణం కేవలం దొంగ ఓటర్లు, పోలింగ్ బూత్ లో కూర్చొని  వైఎస్సార్ సీపీ నాయకులు వేసుకున్న దొంగ ఓట్లు. ఈ అరాచకాలన్నింటిపై ఎన్నికల అధికారులందరికీ ఫిర్యాదు చేశాము. గుర్తించిన చోట రీ-పోలింగ్ పెట్టమని కోరాము' అని సోము వీర్రాజు తెలిపారు.

'వైఎస్సార్ సీపీ నాయకులు సాగిస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలందరూ చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. వారిలో ఉన్న తీవ్రమైన వ్యతిరేకతను రాబోయే రోజుల్లో మీపై తప్పకుండా చూపిస్తారు, మిమ్మల్ని గద్దె దించుతారు' అని సోము వీర్రాజు చెప్పారు.



More Telugu News