పెద్ద నిర్మాణ సంస్థల ముఠా అంటూ ఓటీటీలపై నవాజుద్దీన్ సిద్ధిఖీ సంచలన కామెంట్లు

  • పెద్ద ప్రొడ్యూసర్లు, నటుల కోసం దందా అని మండిపాటు
  • ఓటీటీల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటన
  • కంటెంట్ ఎంత వస్తున్నా క్వాలిటీ ఉండట్లేదని ఆగ్రహం
  • థియేటర్లను ఓటీటీలు చంపేశాయని వ్యాఖ్యలు
ఓటీటీ ప్లాట్ ఫాంలపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదో పెద్ద దందా అని వ్యాఖ్యానించాడు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల కోసం నడుస్తున్న ముఠా అంటూ మండిపడ్డాడు. ఓటీటీల నుంచి తాను తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. ‘బాలీవుడ్ హంగామా’ అనే సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

పనికిమాలిన షోలన్నింటినీ తీసుకొచ్చి పడేస్తున్న చెత్త కుప్పల్లా ఓటీటీ ప్లాట్ ఫాంలు తయారయ్యాయని చెప్పాడు. ఒక్క మంచి షో కూడా ఓటీటీల్లో లేవన్నాడు. షోలు, వాటి సీక్వెల్స్ లో ఒక్క మంచి విషయం కూడా ఉండట్లేదని అన్నాడు. తాను ‘సేక్రెడ్ గేమ్స్’ సిరీస్ చేసేటప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, ఉత్సాహం ఉండేదని, ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు వచ్చేవని చెప్పాడు. కానీ, ఇప్పుడు ఆ తాజాదనం పోయిందని వ్యాఖ్యానించాడు.

ఓటీటీ స్టార్లుగా పిలుస్తున్న కొందరు హీరోలు, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల కోసం ఓటీటీలు ఓ ముఠాలా తయారైందంటూ నవాజుద్దీన్ సిద్ధిఖీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పెద్ద పెద్ద ఓటీటీలతో భారీ రేట్లకు సినిమాలు, షోలను నిర్మాతలు అమ్ముకుంటున్నారని చెప్పాడు. ఎన్నెన్నో కంటెంట్లు వస్తున్నా.. వాటిలో నాణ్యత మాత్రం ఉండడం లేదని, చూడాలనిపించే షోలు ఉండట్లేదని అన్నాడు.

తనకు ఓటీటీల్లో చూద్దామంటేనే అసహ్యమేస్తోందని చెప్పుకొచ్చాడు. చూడడమే ఇష్టం లేనప్పుడు ఓటీటీల్లో తాను మాత్రం ఎలా ఉంటానని అన్నాడు. ఈ వ్యవస్థ మొత్తం థియేటర్లను నాశనం చేసేసిందని నవాజుద్దీన్ మండిపడ్డాడు. కరోనాకు ముందు పెద్ద సినిమాలన్నీ థియేటర్లలోనే రిలీజ్ అయ్యేవని, కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చాడు.


More Telugu News