ప్రైవేటు వాహనంలో హుజూరాబాద్ ఈవీఎం తరలింపు.. పట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

ప్రైవేటు వాహనంలో హుజూరాబాద్ ఈవీఎం తరలింపు.. పట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
  • హుజూరాబాద్‌లో రికార్డు స్థాయిలో 86.57 శాతం పోలింగ్
  • ఈవీఎంను ప్రైవేటు బస్సులో తరలిస్తుండగా అడ్డగింత
  • తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఉపయోగించిన ఈవీఎంను ఓ ప్రైవేటు బస్సులో తరలిస్తుండడాన్నిచూసి అప్రమత్తమైన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరుస్తున్న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఆ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సులో కాకుండా ప్రైవేటు వాహనంలో ఈవీఎంను ఎలా తరలిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి వాహనాన్ని అడ్డుకున్న హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ అధికారుల తీరుపై మండిపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు ఈవీఎంను తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, ఈవీఎంను తరలిస్తున్న బస్సు పంక్చర్ కావడంతో జమ్మికుంట వద్ద ఆపారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాకెక్కి హల్‌చల్ చేస్తున్నాయి. కాగా, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి హుజూరాబాద్‌లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఏకంగా 86.57శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. 306 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 2,37,022 మంది ఓటర్లకుగాను 2,05,053 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.


More Telugu News