మిత్రుడికి కడసారి వీడ్కోలు పలికిన జూనియర్ ఎన్టీఆర్

  • గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత
  • కదిలివచ్చిన సినీ ప్రముఖులు
  • కంఠీరవ స్టేడియంలో పునీత్ కు నివాళులు అర్పించిన ఎన్టీఆర్
  • శివరాజ్ కుమార్ ను హత్తుకుని ఓదార్చిన వైనం
గుండెపోటుతో మరణించిన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ఉంచారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా బెంగళూరుకు తరలి వెళ్లారు. ఈ క్రమంలో అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి కిందట కంఠీరవ స్టేడియానికి చేరుకుని తన మిత్రుడు పునీత్ రాజ్ కుమార్ కు ఘన నివాళులు అర్పించారు. పునీత్ ను విగతజీవుడిలా చూసి ఎన్టీఆర్ భావోద్వేగాలకు గురయ్యారు.

ఎన్టీఆర్ కు, పునీత్ కు మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది. ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటకకు చెందినవారేనని, ఎన్టీఆర్ తమతో ఎంతో సన్నిహితంగా ఉంటారని గతంలో ఓ ఇంటర్వ్యూలో పునీత్ తెలిపారు. కాగా, పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాలో 'గెళయా గెళయా' అనే పాటను ఎన్టీఆర్ పాడడం విశేషం.

పునీత్ నటుడే కాదు గాయకుడు కూడా. అయితే తన చిత్రంలో తాను పాడేందుకు అవకాశం ఉన్నా, పట్టుబట్టి తన మిత్రుడు ఎన్టీఆర్ తో పాడించారు. ఆ పాట కర్ణాటకలో పెద్ద హిట్టయింది. ఆ విధంగా పునీత్, ఎన్టీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి.

పునీత్ నిన్న హఠాన్మరణం చెందారన్న వార్తను ఎన్టీఆర్ నమ్మలేకపోయారు. ఈ విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు. ఇవాళ బెంగళూరు వెళ్లిన ఎన్టీఆర్... పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ను హత్తుకుని ఓదార్చారు. ఎన్టీఆర్ ను చూడగానే శివరాజ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. మిత్రుడి మృతిని జీర్ణించుకోలేకపోతున్న విషయం ఎన్టీఆర్ ముఖంలో స్పష్టంగా కనిపించింది.


More Telugu News