పోలీసుల కాపలాతో పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు రైతుల పాదయాత్రను అడ్డుకుంటున్నారు: లంకా దినకర్

  • రైతుల పాదయాత్రను అడ్డుకోవడం జగన్ తనను తాను అవమానించుకోవడమే
  • రైతులపై రాళ్లదాడి జరగొచ్చని కొందరు అంటున్నారు
  • రైతుల రక్షణ, బాధ్యత పోలీసులదే
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేశారని... ఆ పాదయాత్ర సందర్భంగా అప్పటి ప్రభుత్వం జగన్ కు పోలీసులతో సెక్యూరిటీ కల్పించిందని చెప్పారు. రోప్ వే సెక్యూరిటీతో ఆయన పాదయాత్ర కొనసాగిందని తెలిపారు.

కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆ విషయాలన్నింటినీ మర్చిపోయారని మండిపడ్డారు. సొంత రాజకీయ భవిష్యత్తు కోసం పోలీసుల కాపలాతో పాదయాత్ర చేసిన జగన్... రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి రైతులు చేయాలనుకున్న 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పాదయాత్రను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతుల పాదయాత్రను అడ్డుకోవడం అంటే జగన్ తనను తాను అవమానించుకోవడమేనని అన్నారు.

పాదయాత్ర చేసే రైతులకు పోలీసుల రక్షణ ఇవ్వాల్సింది పోయి... వారిపై రాళ్లదాడి జరగొచ్చు అని కొందరు నేతలు వ్యాఖ్యానించడం దారుణమని లంకా దినకర్ చెప్పారు. పోలీసులు ఉన్నది రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికని... రాళ్ల దాడుల కుట్రలు చేసే వారి కోసం కాదని అన్నారు. రైతుల 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పాదయాత్రకు న్యాయ స్థానం అనుమతిని ఇచ్చిందని... ఇక రైతుల రక్షణ, బాధ్యత పోలీసులదేనని చెప్పారు.


More Telugu News