ఉపరితల ద్రోణి ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు, ఏపీలో దంచికొట్టిన వాన

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఉత్తరాంధ్ర తీరం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి
  • నేడు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
  • కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నుంచి ఉత్తరాంధ్ర తీరం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు అల్పపీడనం వద్ద 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండడంతో చలి పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా అర్లిలో నిన్న అత్యధికంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు, అల్పపీడన ప్రభావంతో ఏపీలోని ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో భారీ వర్షపాతం నమోదైంది. కొత్తపట్నం తీరంలో అలలు, ఈదురు గాలుల తాకిడికి లంగరు వేసిన ఓ బోటు కొట్టుకుపోయింది. దీంతో దాదాపు 10 లక్షల రూపాయల విలువైన వలతోపాటు మొత్తంగా రూ. 20 లక్షల నష్టం వాటిల్లినట్టు మత్స్యకారులు తెలిపారు.

కాగా, వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్టణం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

 తమిళనాడు-శ్రీలంక తీరాలను ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


More Telugu News