సిక్సర్లతో విరుచుకుపడిన అసిఫ్.. పాకిస్థాన్ ‘హ్యాట్రిక్’

  • టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న పాకిస్థాన్
  • సెమీస్‌కు మరింత చేరువ
  • 19వ ఓవర్‌లో వరుస సిక్సర్లతో జట్టుకు విజయాన్ని అందించిన అసిఫ్
  • టీ20 ప్రపంచకప్‌లలో మూడో అత్యధిక స్ట్రైక్ రేట్
  • చివరి వరకు పోరాడి ఓడిన ఆఫ్ఘనిస్థాన్
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత రాత్రి ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచిన పాక్.. మూడు వరుస విజయాలతో సెమీస్‌కు మరింత చేరువైంది. 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌‌ను ఆఫ్ఘనిస్థాన్ తొలుత అద్భుతంగా కట్టడి చేసింది. దీంతో విజయం చివరి వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. చివరి రెండు ఓవర్లలో పాక్ విజయానికి 24 పరుగులు అవసరం కాగా అసిఫ్ అలీ మరోమారు చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయాడు. కరీంజనత్ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలచిన అసిఫ్, ఆ తర్వాత మూడో బంతిని, ఐదో బంతిని, ఆరో బంతిని స్టాండ్స్‌లోకి పంపి సిక్సర్లతో జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు.

మొత్తంగా 7 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అసిఫ్ అలీ 4 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజం 51, ఫకర్ జమాన్ 30  పరుగులు చేసి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ పడిలేచింది. 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ బౌలర్లకు తలొగ్గిన ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో  కెప్టెన్ నబీ, గుల్బదిన్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ బ్యాట్ ఝళిపించడంతో స్కోరు 100 పరుగులు దాటింది.

చివరి ఓవర్లలో పాక్ బౌలర్లపై నబీ, గుల్బదిన్ ఎదురుదాడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. నబీ 35, గుల్బదిన్ 35 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు నజీబుల్లా జాద్రాన్ 22, కరీమ్ జన్నత్ 15 పరుగులు సాధించారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వాసి 2, షహీన్ అఫ్రిది 1, హరీస్ రవూఫ్ 1, హసన్ అలీ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు. సిక్సర్లతో జట్టుకు విజయాన్ని అందించిన అసిఫ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా, 18 టీ20ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌కు యూఏఈలో ఇది తొలి పరాజయం కావడం గమనార్హం.

టీ20 ప్రపంచకప్‌లలో 25కు పైగా పరుగులు చేసిన వారిలో అత్యధిక స్ట్రైక్ రేట్‌ సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో అసిఫ్ అలీ మూడో స్థానంలో నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 బంతుల్లో అజేయంగా 25 పరుగులు చేసిన అసిఫ్ 357.1 స్ట్రైక్ రేట్ సాధించాడు. అతడి కంటే ముందు 2007లో డ్వేన్ స్మిత్ బంగ్లాదేశ్‌పై 7 బంతుల్లో 29 పరుగులతో 414.3 స్ట్రైక్ రేట్ సాధించగా, అదే ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఇంగ్లండ్‌పై 16 బంతుల్లో 58 పరుగులతో 362.5 స్ట్రైక్ రేట్ సాధించాడు.


More Telugu News