చివరి బంతికి ఫోర్ కొట్టలేకపోయిన బంగ్లాదేశ్ కెప్టెన్... ఉత్కంఠపోరులో వెస్టిండీస్ విక్టరీ

  • టీ20 వరల్డ్ కప్ లో ఆసక్తికర సమరం
  • వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 రన్స్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులే చేసిన బంగ్లా
  • చెత్త ఫీల్డింగ్ చేసినా గెలిచిన విండీస్
వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ పోరాటం ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతికి ఫోర్ కొడితే గెలుస్తారనగా, బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా బలంగా బ్యాట్ ఊపినా బంతికి తగల్లేదు. దాంతో వెస్టిండీస్ అనూహ్యరీతిలో విజేతగా నిలిచింది.

ఈ స్వల్పస్కోర్ల మ్యాచ్ లో బంగ్లాదేశ్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టే వెస్టిండీస్ ఫీల్డర్లు అనేక క్యాచ్ లు వదిలి బంగ్లా బ్యాట్స్ మెన్ కు ఇతోధికంగా సాయం చేశారు! రస్సెల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ లోనూ మిస్ ఫీల్డింగ్ కొనసాగింది. అయితే ఆఖరి బంతిని రస్సెల్ ఎంతో పకడ్బందీగా ఆఫ్ సైడ్ వేయడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా నిస్సహాయుడయ్యాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేయగా.... లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో లిటన్ దాస్ 44 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మదుల్లా 31 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. విండీస్ బౌలర్లలో రాంపాల్, హోల్డర్, రస్సెల్, హోసీన్, బ్రావో తలో వికెట్ తీశారు.

సూపర్-12 దశలో గ్రూప్-1లో 3 మ్యాచ్ లు ఆడిన విండీస్ కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్ లో ఓడిపోయుంటే విండీస్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యేవి.

ఇక, నేటి రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ పై టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. 2.4 ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది.


More Telugu News