అవమాన భారంతో న్యూస్ డిబేట్ లైవ్ లో నుంచి వెళ్లిపోయిన అక్తర్.. వీడియో వైరల్

  • పాక్, న్యూజిలాండ్ మ్యాచ్ పై ఇటీవల చర్చ
  • తాను అడిగిన విషయాలకే సమాధానం చెప్పాలన్న టీవీ యాంకర్
  •  తనకు ఇష్టం వచ్చిన అంశంపై మాట్లాడిన అక్తర్
  • టీవీ డిబేట్ నుంచి బయటకు వెళ్లిపోవాలని యాంకర్ ఆదేశం
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇటీవల ఓ న్యూస్ డిబేట్ లో పాల్గొనగా ఆయనకు అవమానం జరిగింది. దీంతో లైవ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నెల 26న పాక్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో పాక్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో పీటీవీ ఓ లైవ్ డిబేట్ నిర్వహించి దానిపై ప్రముఖుల అభిప్రాయాలు అడుగుతోంది.  

ఈ డిబేట్ లో అక్తర్ తో పాటు సర్ వివియన్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గుల్, ఆకిబ్ జావేద్ పాల్గొన్నారు. ఆ సమయంలో పాకిస్థాన్ బౌలర్లు హరీస్ రవూఫ్, షహీన్ ఆఫ్రిది ఆటతీరును అక్తర్ ప్రశంసించాడు. అయితే, మధ్యలో టీవీ యాంకర్ నౌమన్ నియాజ్ కలుగజేసుకుని తాను డిబేట్ లో అడిగిన అంశాలకు సమాధానం చెప్పాలని, ఇతర అంశాలను ప్రస్తావించకూడదని చెప్పాడు.

ఆ యాంకర్ మాటలను అక్తర్ పట్టించుకోలేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పుకుంటూ వెళ్లాడు. దీంతో యాంకర్ కు కోపం వచ్చేసింది. ఆ డిబేట్ నుంచి అక్తర్ వెళ్లిపోవాలని యాంకర్ ఆదేశించాడు. అక్తర్ ఆ అవమానంతో డిబేట్ నుంచి వెళ్లిపోయాడు. ఇక అక్తర్ ను ఆ టీవీ యాంకర్ వెళ్లిపోవాలని చెప్పడం పట్ల విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ టీవీ చానెల్ తాజాగా వివరణ ఇచ్చింది. అక్తర్, నౌమన్ కు మధ్య జరిగిన గొడవపై విచారణకు ఆదేశించామని, ఈ విచారణ పూర్తయ్యే వరకు టీవీ చానెల్ లోకి వారిరువురినీ అనుమతించబోమని చెప్పింది.

టీవీ చానెల్ చేసిన ప్రకటనపై అక్తర్ మండిపడ్డాడు. ఆ చానెల్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని చెప్పాడు. డిబేట్ లో నుంచి తానే ప్రేక్షకులందరి ముందు బయటకు వచ్చేశానని చెప్పాడు. ఆ టీవీ చానెల్ తనను బహిష్కరించడం ఏంటని ప్రశ్నించాడు. తనను టీవీ కార్యక్రమాల నుంచి బహిష్కరించడానికి వారు ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశాడు.


More Telugu News