కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత... తీవ్ర విషాదంలో కర్ణాటక

  • ఈ ఉదయం పునీత్ కు గుండెపోటు
  • జిమ్ లో కుప్పకూలిన హీరో
  • ఆసుపత్రికి తరలింపు
  • చికిత్స పొందుతూ మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతిలో కుటుంబ సభ్యులు
  • భోరున విలపిస్తున్న అభిమానులు
కన్నడ చిత్రపరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ అగ్రహీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్ బెంగళూరు విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనను బతికించేందుకు వైద్యులు అత్యంత తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.

ఈ ఉదయం ఆయన జిమ్ లో కుప్పకూలిపోగా, ఆసుపత్రికి తరలించిన సమయంలోనే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ మృతితో కర్ణాటక వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. పునీత్ చికిత్స పొందిన విక్రమ్ ఆసుపత్రి ఎదుట అభిమానులు గుండెలు బాదుకుంటూ భోరున విలపిస్తుండడం మీడియాలో కనిపించింది. పునీత్ కుటుంబసభ్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. వారు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.

ప్రస్తుతం సీఎం బసవరాజ్ బొమ్మై ఆసుపత్రి వద్దే ఉన్నారు. కన్నడ సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఇక, పునీత్ కన్నుమూత నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా సినీ థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి.

దిగ్గజ నటుడు రాజ్ కుమార్ మూడో తనయుడైన పునీత్ రాజ్ కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యమిచ్చే పునీత్ గుండెపోటుకు గురికావడం విధి రాత అనుకోవాలి. పునీత్ ను అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు. బాలనటుడిగా ప్రస్థానం ఆరంభించిన పునీత్ రాజ్ కుమార్ 1985లో వచ్చిన బెట్టాడ హూవు చిత్రానికి గాను చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు అందుకున్నారు.

హీరోగా తన కెరీర్లో 29కి పైగా చిత్రాల్లో నటించారు. 2002లో వచ్చిన అప్పు చిత్రం హీరోగా పునీత్ కు తొలి చిత్రం. అభి, వీర కన్నడిగ, అజయ్, హుదుగారు, అంజనీపుత్ర, రామ్, అరసు చిత్రాలు పునీత్ కెరీర్లో భారీ హిట్లు. పునీత్ చివరిగా నటించిన చిత్రం యువరత్న. ఇది ఈ ఏడాది ఆరంభంలో రిలీజైంది. పునీత్ రాజ్ కుమార్ కు 1999లో అశ్విని రేవంత్ తో వివాహం జరిగింది. వీరికి ధృతి, వందన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


More Telugu News