చిత్ర పరిశ్రమలో అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి: అల్లు అర్జున్

  • 'వరుడు కావలెను' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
  • చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపిన బన్నీ
  • ఈ నెల 29న వరుడు కావలెను రిలీజ్
'వరుడు కావలెను' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలోని పాటలు తన ఇంట్లో కూడా ఎప్పుడూ వినిపిస్తుంటాయని అన్నారు. ముఖ్యంగా 'దిగు దిగు నాగ' పాట అంటే తన కుమార్తెకు ఎంతో ఇష్టమని వెల్లడించారు.

'వరుడు కావలెను' చిత్రంలో హీరోగా నటించిన నాగశౌర్య ఎంతో స్వీట్ పర్సన్ అని వెల్లడించారు. తనకు సెల్ఫ్ మేడ్ పీపుల్ అంటే చాలా ఇష్టమని, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఎదిగిన వారిని తాను అభిమానిస్తానని అన్నారు. నాగశౌర్య కూడా ఎవరి అండ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, నాగశౌర్య పెద్దహీరో అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

ఇక హీరోయిన్ రీతూ వర్మ గురించి చెబుతూ, ఆమె మొదటి చిత్రం నుంచే తాను ఆమె అభిమానినని వెల్లడించారు. రీతూవర్మలో తనకు బాగా నచ్చేది ఆమె హుందాతనం అని పేర్కొన్నారు. ఎప్పుడు మాట్లాడినా రీతూ వర్మ మాటల్లో డిగ్నిటీ ఉట్టిపడుతుందని చెప్పారు.

ఈ చిత్ర దర్శకురాలు లక్ష్మీ సౌజన్యకు బన్నీ శుభాకాంక్షలు తెలిపారు. ఓ మహిళ సినిమాకు దర్శకత్వం వహించడం అభినందనీయం అని అన్నారు. సాధారణంగా అమ్మాయిలు హీరోయిన్లు అయ్యేందుకు ఇండస్ట్రీకి వస్తుంటారని, అలాకాకుండా దర్శకులుగా, ఇతర టెక్నీషియన్లుగానూ మహిళలు రావాలన్నదే తన అభిమతం అని వివరించారు. ముంబయిలో తాను ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అక్కడి సిబ్బందిలో సగం మంది అమ్మాయిలే కనిపించారని, మన ఇండస్ట్రీలో కూడా అమ్మాయిలు అనేక రంగాల్లో ప్రాతినిధ్యం వహించే రోజు రావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.


More Telugu News