అమిత్ షానే చంద్రబాబుకు ఫోన్ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు: సజ్జల ఎద్దేవా

  • ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన
  • దొరకని అమిత్ షా అపాయింట్ మెంట్
  • హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
  • అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేశాడంటూ మీడియా కథనాలు
టీడీసీ అధినేత చంద్రబాబు వారం కిందట మొదలుపెట్టిన మురికి డ్రామా నిన్నటితో ముగిసిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. డ్రామాలు, అబద్ధాలు, లేనివి ఉన్నట్టు భ్రమలు కల్పించడం చంద్రబాబు ప్రత్యేకతలు అని విమర్శించారు. చంద్రబాబు తన డ్రామాలు విఫలమైనప్పటికీ, అదొక బ్రహ్మాండమైన విజయం అని చెప్పుకుంటారని అన్నారు. ఆయన ఏమీ చేయకపోయినా సరే ఆయన చేసినట్టుగానే ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా ఉందని వ్యాఖ్యానించారు.

"ఢిల్లీలో అమిత్ షాను కలవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది చంద్రబాబుకే తెలియాలి.  ఢిల్లీకి వెళ్లి ఏదో పొడిచేస్తాడనేంతగా ఇచ్చిన బిల్డప్ ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఆయనను అమిత్ షాను కలవమని ఎవరు చెప్పారు? రాష్ట్రంపై ఏమని ఫిర్యాదు చేస్తారు? దానిపై అమిత్ షా ఏమని చర్యలు తీసుకుంటారు? చక్రం తిప్పుతానని వెళ్లి దీపావళి విష్ణుచక్రం తిప్పారా? కిక్కురుమనకుండా మళ్లీ హైదరాబాద్ వచ్చేశారు.

చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత అమిత్ షానే ఫోన్ చేసినట్టు మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి ఏ అమిత్ షాతో మాట్లాడారో తెలియదు. చంద్రబాబు... నరేంద్ర మోదీతో, అమిత్ షాతోనైనా మాట్లాడగలరు. ఒకవేళ ఆయన మాట్లాడకపోయినా, మాట్లాడినట్టు నమ్మించే మీడియా సంస్థలు ఉన్నాయి" అన్నారు వ్యంగ్యంగా.   


More Telugu News