గుజరాత్ లో ఏపీ పోలీసుల సోదాలు.. 'ఉగ్ర' సంబంధాల నేపథ్యంలో ఐదుగురి అరెస్ట్

  • పంచమహల్ లోని గోద్రాలో దాడులు
  • అరెస్టయిన వారిలో ఒక మహిళ
  • ఐఎస్ఐకి నేవీ సమాచారం ఇచ్చారని ఆరోపణలు
గుజరాత్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా వుంది. పాక్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రతినిధులకు భారత నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారని 2019లో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. భారత నౌకాదళ ఉద్యోగులను ఐఎస్ఐ ప్రతినిధులు హనీట్రాప్ చేసి సమాచారం సేకరించారని తేల్చారు. ఈ కేసు ‘విశాఖ గూఢచర్య రాకెట్’గా పేరుపడిపోయింది.

ఈ కేసుకు సంబంధించి గుజరాత్ లోని పంచమహల్ జిల్లా గోద్రాలో సోదాలు చేశారు. అక్కడి పోలీసుల సాయంతో దాడులు చేశారు. దాడుల విషయంగానీ, ఐదుగురి అరెస్ట్ విషయాన్ని గానీ పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వాస్తవానికి ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కేసు దర్యాప్తును చేపట్టింది. అప్పట్లో గోద్రాకు చెందిన వారినే అధికారులు అరెస్ట్ చేశారు.

ఇప్పుడు కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడే దాడులు చేయడం, ఐదుగురిని అరెస్ట్ చేయడం చర్చకు దారి తీసింది. అప్పటి కేసులోనే కొత్త లీడ్స్ ఆధారంగా సోదాలు చేశారా? లేదంటే కొత్త కేసు నమోదు చేశారా? అన్నదానిపై స్పష్టత లేదు. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చేస్తేగానీ అసలు వివరాలేంటన్నది తెలియదు.


More Telugu News