'పెగాస‌స్' వ్యవహారంలో నిపుణుల కమిటీ ఏర్పాటు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు

  • సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ  
  • చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతమ‌న్న సుప్రీంకోర్టు
  • ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని వ్యాఖ్య‌
దేశంలో పెగాసస్‌ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. పెగాసస్‌ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమిస్తున్న‌ట్లు తెలిపింది.  

చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన స‌రికాద‌ని, ఈ విష‌యాన్ని కోర్టు సహించదని స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్‌ ప్రత్యక్ష బాధితులని తెలిపింది. టెక్నాల‌జీ దుర్వినియోగంపై పరిశీలన చేస్తామని స్ప‌ష్టం చేసింది.

కాగా, సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పెగాస‌స్‌పై వాదనలను విన్న తర్వాత సెప్టెంబరు 13న తీర్పును వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. దేశంలోని ప్ర‌ముఖుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాలంటూ పలు వ్యాజ్యాలు దాఖలు కాగా వీటిపై సుప్రీంకోర్టు విచార‌ణ కొన‌సాగించింది. ఈ రోజు తీర్పు వెల్ల‌డిస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది.


More Telugu News