టీ20 వరల్డ్ కప్: పాకిస్థాన్ కు వరుసగా రెండో విజయం

  • సూపర్-12 దశలో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్
  • 5 వికెట్లతో నెగ్గిన పాక్
  • మరో 8 బంతులు మిగిలుండగానే లక్ష్యఛేదన
  • రాణించిన రిజ్వాన్, ఆసిఫ్ అలీ, షోయబ్ మాలిక్
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు మరోసారి ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. షార్జాలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

 తమ కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టే పాక్ బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ కు ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం కష్టమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పాక్ మరో 8 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. సీనియర్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ (26 నాటౌట్), ఆసిఫ్ అలీ (12 బంతుల్లో 27 నాటౌట్) ధాటిగా ఆడడంతో పాక్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసింది.

అంతకుముందు ఓపెనర్ రిజ్వాన్ 33 పరుగులు చేయగా, కెప్టెన్ బాబర్ అజామ్ (9) స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. ఫకార్ జమాన్ 11, హఫీజ్ 11 నిరాశపర్చగా... మాలిక్, అలీ జోడీ న్యూజిలాండ్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను లాగేసుకుంది. సూపర్-12 దశలో పాకిస్థాన్ కు ఇది వరుసగా రెండో విజయం. పాక్ తన తొలి మ్యాచ్ లో టీమిండియాపై నెగ్గిన సంగతి తెలిసిందే.


More Telugu News