ఏపీ గ్రామ, వార్డు మహిళా పోలీసుల నియామకంపై హైకోర్టు విచారణ.. సీఎస్, డీజీపీలకు నోటీసులు

  • 15 వేల మంది మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు
  • జీవో 59ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్
  • పోలీసు నియామకాలు బోర్డు ద్వారానే జరగాలన్న పిటిషనర్
గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా కార్యదర్శులను ఏపీ ప్రభుత్వం పోలీసులుగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నియామకాలను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

 15 వేల మంది మహిళా కార్యదర్శులకు పోలీసు విధులను అప్పగించడాన్ని పిటిషనర్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్ కు విరుద్ధమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59ని రద్దు చేయాలని కోర్టును కోరారు. పోలీసు నియామకాలు బోర్డు ద్వారానే జరగాలని అన్నారు.

పోలీసు విధులను నిర్వహించే హోంగార్డులను కూడా పోలీసులుగా పరిగణించరని... అలాంటప్పుడు వీరిని పోలీసులుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, ఏపీపీఎస్సీ ఛైర్మన్ లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.


More Telugu News