చిత్తుగా ఓడిన స్కాట్లాండ్.. ఆఫ్ఘన్ ఘన విజయం

  • కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన స్కాట్లాండ్
  • 5 వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చిన ముజీబుర్
  • జట్టులో ఐదుగురు ఆటగాళ్ల డకౌట్
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సూపర్ 12 గ్రూప్‌లో గత రాత్రి స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్కాట్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న బ్యాట్స్‌మెన్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. టీ20లోని అసలైన మజా అందించారు.

ఓపెనర్లు హజ్రతుల్లా జాజాయ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేయగా, గుర్బాజ్ 37 బంతుల్లో 4 సిక్సర్లు, ఫోర్‌తో 46 పరుగులు చేశాడు. నజీబుల్లా 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం 191 పరుగుల కొండంత లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్కాట్లాండ్ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. 10.2 ఓవర్లలో 60 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్లు జార్జ్ మున్సీ (25), కెప్టెన్ కైల్ కోయెట్జెర్ (10), క్రిస్ గ్రీవ్స్ (12) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు.

ఐదుగురు ఆటగాళ్లు డకౌట్ అవడం విశేషం. ఒకరు 1, మరొకరు 4, ఇంకొకరు మూడు పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్ ముజీబుర్ రహ్మన్ నాలుగు ఓవర్లు వేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.


More Telugu News