టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు సుప్రీంకోర్టులో ఊరట

  • గొట్టిపాటి గ్రానైట్ కు ఏపీ సర్కారు షోకాజ్ నోటీసులు
  • నోటీసులపై గతంలో స్టే ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్
  • సింగిల్ బెంచ్ ఆదేశాలను పక్కనబెట్టిన డివిజన్ బెంచ్
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన గొట్టిపాటి
టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. గొట్టిపాటికి చెందిన గ్రానైట్ కంపెనీకి ప్రభుత్వం జారీచేసిన షోకాజ్ నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ వ్యవహారంపై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇవ్వగా, గ్రానైట్ కంపెనీ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. కమిషన్ సిఫారసు మేరకు గ్రానైట్ కంపెనీకి రూ.50 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.

దీనిపై గొట్టిపాటి హైకోర్టును ఆశ్రయించగా, షోకాజ్ నోటీసులను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అయితే డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలను పక్కనబెట్టింది. దాంతో గొట్టిపాటి రవికుమార్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

తమ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ సిఫారసు చట్టవిరుద్ధమని రవికుమార్ పేర్కొన్నారు. వాదనలు విన్న పిమ్మట ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులను నిలుపుదల చేస్తున్నట్టు సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.


More Telugu News