పాకిస్థాన్‌లో ఇమ్రాన్ గద్దె దిగాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు 

  • పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు
  • దేశాన్ని ఇమ్రాన్ సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం
  • లాంగ్‌మార్చ్‌లో ఘర్షణ.. ఇద్దరు పోలీసు అధికారుల మృతి
ఆందోళనలతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనకు దిగుతున్నారు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఇమ్రాన్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడమే ఈ నిరసనలకు కారణం.

పెరుగుతున్న ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు వేలాది మంది కరాచీలో రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమాంతం పెరిగిపోయిన ధరలతో పేదలు కడుపునిండా తినలేని పరిస్థితి దాపురించిందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌ఖాన్‌కు తెలియదని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని జమీయత్ ఉలేమా-ఇ-ఇస్లాం సంస్థ నేత రషీద్ సుమ్రో డిమాండ్ చేశారు.

మరోవైపు, గతేడాది ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అరెస్ట్ చేసిన తమ నేతలను విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌ వరకు నిర్వహిస్తున్న లాంగ్‌మార్చ్‌ను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. పోలీసులు వారిపై బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ క్రమంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో నిరసనకారులు వారిపై దాడికి దిగారు. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.


More Telugu News