భారత్ కు భంగపాటు... 'ప్రపంచకప్' ఆనవాయతీని తిరగరాసిన పాకిస్థాన్

  • టీ20 వరల్డ్ లో పాకిస్థాన్ వర్సెస్ భారత్
  • 10 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించిన పాక్
  • 152 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించిన వైనం
  • అజేయంగా నిలిచిన రిజ్వాన్, బాబర్ అజామ్
ప్రపంచకప్ పోటీల్లో భారత్ పై గెలవలేదన్న అప్రదిష్ఠను పాకిస్థాన్ ఒక్క దెబ్బతో చెరిపివేసింది. వరల్డ్ కప్ చరిత్రలో దాయాదిపై తొలి విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశలో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాక్ 10 వికెట్ల తేడాతో అత్యంత ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 152 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. భారత ఆటగాళ్లు ఆపసోపాలు పడి నమోదు చేసిన పరుగులను, పాక్ ఓపెనర్లు ఇద్దరే ఛేదించారు.

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేయగా, కెప్టెన్ బాబర్ అజామ్ తన క్లాస్ రుచి చూపిస్తూ 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేశాడు. వీరిద్దరి జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు విఫలయత్నాలు చేశారు.

కాగా, వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ పై భారత్ కు ఇది అత్యంత ఘోర పరాజయం. ఈ రెండు జట్లు వరల్డ్ కప్ లో తలపడడం ఇది 13వ సారి కాగా, గతంలో 12 పర్యాయాలు భారత జట్టే నెగ్గింది. కానీ, ఆ ఓటమి ఆనవాయతీని తిరగరాస్తూ పాకిస్థాన్ దుబాయ్ లో అద్భుత విజయం సాధించింది.

భారత జట్టుకు ఐపీఎల్ అనుభవం అక్కరకు రాలేదు, ధోనీ సలహాలు ఉపయోగపడలేదు.... టాస్ ఓడిన క్షణం నుంచి టీమిండియాకు అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. బ్యాటింగ్ ఆరంభంలోనే ఓపెనర్లను చేజార్చుకోగా, భారీ స్కోరు సాధించాలన్న ఆశలకు అక్కడే విఘాతం ఏర్పడింది. తమకు సొంతగడ్డ వంటి దుబాయ్ లో పాక్ ఆటగాళ్లు చిచ్చరిపిడుగుల్లా ఆడి అపూర్వమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ను ఓడించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పొందారు.


More Telugu News