టీ20 వరల్డ్ కప్: టాస్ గెలిచిన పాకిస్థాన్.. భారత్ కు మొదట బ్యాటింగ్

  • టీ20 వరల్డ్ కప్ లో కీలక సమరం
  • సూపర్-12లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న పాక్
  • దుబాయ్ లో మ్యాచ్
టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ జరుగుతోందా అనేంతగా సందోహం నెలకొంది అంటే అందుకు కారణం భారత్-పాకిస్థాన్ మ్యాచే! నేడు ఈ చిరకాల ప్రత్యర్థులు సూపర్-12 పోరులో భాగంగా దుబాయ్ లో తలపడుతున్నారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం దక్కడం పట్ల టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఒకవేళ టాస్ గెలిచి ఉంటే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. పిచ్ చూస్తే చాలా డిఫరెంట్ గా కనిపిస్తోందని అన్నాడు.

అంతకుముందు టాస్ గెలిచిన సందర్భంగా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడుతూ, ఆరంభంలోనే వికెట్లు తీసి భారత్ పై ఒత్తిడి పెంచాలన్నది తమ వ్యూహమని చెప్పాడు. పిచ్ పై తేమ కూడా కీలకం కానుందని పేర్కొన్నాడు. ఇతర జట్ల బ్యాటింగ్ లైనప్ లను దెబ్బతీయడంలో పాకిస్థాన్ బౌలర్ల ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నాడు.

భారత జట్టు ఇదే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, జస్ర్పీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్ జట్టు ఇదే...
బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వాసిం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, షహీన్ అఫ్రిది.

వరల్డ్ కప్ లలో పాకిస్థాన్ పై టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ రెండు జట్లు ఐసీసీ వరల్డ్ కప్ లలో 12 సార్లు తలపడగా, అన్నింటా భారత్ నే విజయం వరించింది. టీ20 వరల్డ్ కప్ లలో ఇరుజట్లు ఐదు పర్యాయాలు తలపడగా, పాకిస్థాన్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది.


More Telugu News