గౌరవ ప్రతిష్ఠలు ఒక్క ముఖ్యమంత్రికే కాదు.. ప్రతి ఒక్కరికీ ఉంటాయి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

  • రాజ్యాంగ బద్దమైన ఇతర పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యల విషయంలో అంత ఉత్సాహం ఏమైంది?
  • రిమాండ్ రిపోర్టులో పొంతనలేని వివరాలు
  • పట్టాభి అరెస్ట్ విషయంలో మేజిస్ట్రేట్ అనుమతి ఎందుకు తీసుకోలేదు?
  • అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు 41ఏ నోటీసు ఎందుకిచ్చారు?
టీడీపీ నేత పట్టాభిరామ్ అరెస్ట్ విషయంలో ఎందుకంత అత్యుత్సాహం చూపించారంటూ పోలీసులపై ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. చట్టబద్ధ పాలన అంటే పోలీసులకు ఏమాత్రం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో లేని ఉత్సాహం.. కేవలం ముఖ్యమంత్రి  విషయంలోనే  ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. గౌరవ ప్రతిష్ఠలు ఒక్క ముఖ్యమంత్రికే  కాదని, అవి ప్రతి ఒక్కరికీ  ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడైనా సరే.. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొంది. ముఖ్యమంత్రి అయినా సరే చట్టం కంటే ఎక్కువ కాదని స్పష్టం చేసింది.

పట్టాభి అరెస్ట్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్ట్ విషయంలో పరస్పర విరుద్ధమైన, పొంతనలేని వివరాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం ఆత్మహత్యా సదృశం కాదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. అరెస్ట్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు 41ఏ నోటీసు ఎందుకిచ్చారని నిలదీసింది. నోటీసు ఇచ్చిన తర్వాత మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని తప్పుబట్టింది. బెయిలు ఇవ్వొద్దంటూ ఏజీ ఎస్.శ్రీరామ్ చేసిన వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత.. పట్టాభికి బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, బెయిలు లభించడంతో రాత్రి ఏడు గంటల సమయంలో పట్టాభి జైలు నుంచి విడుదలయ్యారు.


More Telugu News