బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది వీక్షణ

  • బుర్జ్ ఖలీఫాపై రెండుసార్లు బతుకమ్మ ప్రదర్శన
  • జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు కూడా
  • బుర్జ్ ఖలీఫా వద్ద బతుకమ్మ ఆడిన కవిత
  • తెలంగాణతోపాటు మొత్తం దేశానికే గర్వకారణమన్న ఎమ్మెల్సీ
ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ కనువిందు చేసింది. గతరాత్రి రెండుసార్లు.. 9.40 గంటలకు ఒకసారి, 10.40 గంటలకు మరోసారి మూడు నిమిషాలపాటు బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోను ప్రదర్శించారు. అలాగే, తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలతోపాటు జైహింద్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాలను కూడా ప్రదర్శించారు.  దీనిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది వీక్షించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన పాటతో పాటు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రవాసులు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినదించారు.

ఈ సందర్బంగా తెలంగాణ మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బుర్జ్ ఖలీఫా వద్ద బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ఒక్క తెలంగాణకే కాదని, మొత్తం దేశానికే గర్వకారణమని అన్నారు. బతుకమ్మ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News