గోవాపై మమత కన్ను.. 28 నుంచి రెండు రోజుల పర్యటన

  • బీజేపీని, వారి విభజన రాజకీయాలను ఓడించండి
  • గత పదేళ్లుగా గోవా ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు
  • బీజేపీని ఓడించేందుకు ప్రజలు, సంస్థలు ముందుకు రావాలి
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు గోవాలో పాగా వేసేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది గోవాలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఇది వరకే ప్రకటించిన దీదీ..ఈ నెల 28 నుంచి రెండు రోజులపాటు గోవాలో పర్యటించనున్నారు. ఈ మేరకు నిన్న ఓ ట్వీట్ చేశారు. 28న గోవాలో తొలి పర్యటనకు సిద్దమైనట్టు అందులో పేర్కొన్నారు. బీజేపీని, వారి విభజన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు, సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి రావాలని కోరారు. గత దశాబ్దకాలంగా గోవా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, గోవాపై కన్నేసిన టీఎంసీ పలువురు నేతలను తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే టీఎంసీలో చేరారు. స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గోవాంకర్ కూడా టీఎంసీకి మద్దతు ప్రకటించారు. ఇంకోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా గోవాను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కట్టబెడితే ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు అందేలా కృషి చేస్తామంటూ హామీల వర్షం కురిపించారు.


More Telugu News