ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనడం ఊహాజనితం: భట్టి విక్రమార్క

  • ఈటల కాంగ్రెస్ లోకి వెళతారన్న కేటీఆర్
  • ఈటల, రేవంత్ ఓ రిసార్ట్ లో చర్చలు జరిపారని వెల్లడి
  • కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన భట్టి
  • ఓటమి భయంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శలు
ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ఓ రిసార్ట్ లో రహస్యంగా కలిశారని, ఏడాదిన్నర తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. దీనిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితం అని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నారని భట్టి విమర్శించారు.

రాష్ట్రంలో ఎన్నో ప్రజాసమస్యలు ఉండగా, టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై బురద చల్లేందుకు ప్రయత్నించడాన్ని ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. హుజూరాబాద్ స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. అసలు, టీఆర్ఎస్, బీజేపీ మధ్యే తెరవెనుక ఒప్పందాలు ఉన్నాయని భట్టి ఆరోపించారు. ఢిల్లీలో కేసీఆర్ ఏం మంతనాలు చేశారో చెప్పాలని నిలదీశారు. టీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేసేందుకు చర్చలు జరిపారా? అని ప్రశ్నించారు.


More Telugu News