టీ20 వరల్డ్ కప్ లో నేటి నుంచి 'సూపర్-12'... తొలిమ్యాచ్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా

  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • అబుదాబిలో మ్యాచ్
  • బలమైన జట్టుతో బరిలో దిగిన కంగారూలు
  • టీ20 స్పెషలిస్టులకు చోటు కల్పించిన దక్షిణాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ లో రెండో అంకానికి తెరలేచింది. నేటి నుంచి సూపర్-12 పోటీలు జరగనున్నాయి. అబుదాబి వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా బలమైన జట్టును ఎంపిక చేసింది. ఓపెనర్లుగా కెప్టెన్ ఫించ్, వార్నర్.... ఆపై స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్ లతో ఆసీస్ బ్యాటింగ్ పటిష్ఠంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలోనూ స్టార్క్, కమిన్స్, హేజెల్ వుడ్, జంపా వంటి ప్రతిభావంతులు ఉన్నారు.

ఇక టెంబా బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా ఉన్నంతలో టీ20 స్పెషలిస్టులతో బరిలో దిగింది. బ్యాటింగ్ లో డికాక్, బవుమా, మార్ క్రమ్, మిల్లర్, క్లాసెన్... బౌలింగ్ లో రబాడా, నోర్జే, షంసీ, కేశవ్ మహరాజ్ సత్తా చాటితే కంగారూలకు కళ్లెం వేయొచ్చని సఫారీ శిబిరం భావిస్తోంది.

కాగా, ఈ రెండు జట్లు గ్రూప్-1లో ఉన్నాయి. ఇవి కాక ఈ గ్రూపులో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా ఉన్నాయి.


More Telugu News