ఫొటోలు ఉంటే కేటీఆర్ బయటపెట్టాలి: డీకే అరుణ

  • రేవంత్, ఈటల రహస్యంగా భేటీ అయ్యారన్న కేటీఆర్
  • ఏడాదిన్నర తర్వాత ఈటల కాంగ్రెస్ లో చేరుతారని వ్యాఖ్య
  • బ్లాక్ మెయిల్ రాజకీయాలు టీఆర్ఎస్ కు అలవాటేనన్న అరుణ
ఈ నెల 30న హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగబోతోంది. ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలో జయకేతనం ఎగురవేసేందుకు టీఆర్ఎస్, బీజేపీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని, గోల్కొండ రిసార్టులో వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ లో ఈటల చేరుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు డీకే అరుణ అరుణ మాట్లాడుతూ, రేవంత్, ఈటల భేటీ ఫొటోలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం టీఆర్ఎస్ పార్టీకి అలవాటేనని అన్నారు. హుజూరాబాద్ లో ఓడిపోతామనే భయంతో కుట్రలకు పాల్పడుతోందని చెప్పారు. తనను సీఎం కాకుండా అడ్డుకున్నారనే కోపంతో ఈటలపై కేటీఆర్ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News