నేతాజీ చితాభస్మం విషయంలో పీవీ ప్రభుత్వం అందుకే వెనక్కి తగ్గింది: సుభాష్ చంద్రబోస్ బంధువు

  • జపాన్‌లోని బౌద్ధ ఆలయంలో నేతాజీ అస్థికలు
  • భారత్‌కు తీసుకొస్తే కోల్‌కతాలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందన్న నిఘావర్గాలు
  • అస్థికలపై నేతాజీ కుమార్తె అనితా బోస్‌కే సర్వాధికారాలు
  • పేర్కొన్న నేతాజీ బంధువు ఆశిష్ రే
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చితాభస్మం అంశం మరోమారు తెరపైకి వచ్చింది. నిజానికి నేతాజీ జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. 18 ఆగస్టు 1945లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారని కొందరంటే, లేదు ఆయన భారత్‌కు వచ్చి సాధువులా జీవిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.

 ఇంకొందరు మాత్రం అసలు విమాన ప్రమాదమే జరగలేదని, రష్యా జైలులో నేతాజీని బంధించారని కూడా చెబుతారు. ఇక అసలు విషయానికి వస్తే.. జపాన్‌లోని బౌద్ధ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ అస్థికల పాత్రను భారత్‌కు తీసుకొచ్చేందుకు అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం నిర్ణయించిందట. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయట.

అయితే, ఆయన చితాభస్మాన్ని దేశానికి తీసుకొస్తే కోల్‌కతాలో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతోనే ప్రభుత్వం ఆ యోచనను విరమించుకుందని నేతాజీ బంధువు, పరిశోధకుడు, రచయిత అయిన ఆశిష్ రే తాజాగా వెల్లడించారు. ఇప్పటికైనా దానిని తీసుకురావాలని కోరారు.

ఇక ఆ అస్థికలపై నేతాజీ కుమార్తె ప్రొఫెసర్ అనితా బోస్‌కే సర్వాధికారాలు ఉంటాయని అన్నారు. ఆర్థికవేత్త అయిన ఆమె ప్రస్తుతం జర్మనీలో ఉంటున్నట్టు చెప్పారు. ఆజాద్ హింద్ ప్రభుత్వ 78వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన వర్చువల్ సెమినార్‌లో పాల్గొన్న ఆశిష్ రే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News