సినీ నటి సమంత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఎల్లుండికి వాయిదా

  • విడాకులు కాకముందే సమంత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా యూట్యూబ్ చానళ్లలో ప్రచారం
  • ఇది ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి ఇబ్బంది కలిగిస్తుందన్న సమంత న్యాయవాది
  • న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
తనపై రెండు యూట్యూబ్ చానళ్లతోపాటు డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై ప్రముఖ సినీనటి సమంత దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం విచారణను ఎల్లుండి (25వ తేదీ)కి వాయిదా వేసింది. పిటిషన్ విచారణార్హతపై నిన్న వాదనలు జరిగాయి.

 ప్రతివాదులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పిటిషన్ వేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. దీనికి సమంత తరపు న్యాయవాది స్పందిస్తూ.. సెక్షన్-80 సీపీసీ ప్రకారం నోటీసులు ఇవ్వకుండా కూడా పిటిషన్ వేయొచ్చన్నారు. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేశారు.

నాగ చైతన్యతో విడాకులు కాకముందే తన క్లయింటు పరువుకు భంగం కలిగేలా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని యూట్యూబ్ చానళ్లు వ్యవహరించాయన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. ఆ చానళ్లు చేసిన వ్యక్తిగత ఆరోపణలు ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయన్నారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అనంతరం విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.


More Telugu News