బాబర్ ఆజంను విరాట్ కోహ్లీతో పోల్చకూడదు!: వసీం అక్రమ్

  • కోహ్లీ రికార్డును బాబర్ సమం చేస్తాడు
  • కాలం గడుస్తున్నకొద్దీ రాటుదేలుతాడు
  • కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన అక్కర్లేదు 
  • అతడికి ప్రత్యామ్నాయం లేదని వ్యాఖ్య
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చడం సబబు కాదని పాక్ మాజీ ఆల్ రౌండర్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీతో పోలిస్తే చాలా నిదానమే అయినా.. కచ్చితంగా కోహ్లీని బాబర్ సమం చేస్తాడని అన్నాడు. దుబాయ్ లో నిర్వహించిన సలాం క్రికెట్ 2021 కార్యక్రమంలో అక్రమ్ మాట్లాడాడు. కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నో ఏళ్లుగా అతడు తన బ్యాటింగ్ తో నిరూపించుకుంటూనే ఉన్నాడని చెప్పాడు.

బాబర్ ఆజం ఇటీవలే టీమ్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడని, కానీ, అతడు దేన్నైనా చాలా వేగంగా నేర్చుకుంటాడని, ఏకసంధాగ్రాహి అని అభివర్ణించాడు. కాలం గడుస్తున్నకొద్దీ అతడు రాటుదేలుతాడన్నాడు. విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయం అంటూ లేదని, విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీనేనని అన్నాడు. అంతలా ప్రపంచ క్రికెట్ ను విరాట్ శాసిస్తున్నాడని అక్రమ్ కొనియాడాడు. అయితే, విరాట్ కోహ్లీ లాగానే బాబర్ ఆజం కూడా అన్ని ఫార్మాట్లలో టాప్ 10లో కొనసాగుతున్నాడని చెప్పాడు.

ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అనగానే వరల్డ్ కప్ రికార్డులతో సంబంధం లేదని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. ఏ ఆటగాడు కూడా రికార్డులను నమ్మరన్నాడు. గత చరిత్రతో సంబంధం లేదని తేల్చి చెప్పాడు. అది కేవలం లెక్కలేసుకునేవాళ్ల పని అన్నాడు. కాగా, ఈ నెల 24న భారత్ తన తొలి మ్యాచ్ లో పాక్ ను ఢీకొట్టనున్న సంగతి తెలిసిందే.

సరిహద్దులో ఇటీవలి ఘర్షణ వాతావరణం, కశ్మీర్ లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో మ్యాచ్  నుంచి తప్పుకోవాలంటూ పలువురు బీసీసీఐని ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెగలు పుట్టిస్తున్న దుబాయ్ వాతావరణంలో మరింత హాట్ హాట్ గా ఇండియా–పాక్ మ్యాచ్ జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Telugu News