ఆమిర్ ఖాన్ తాజా వాణిజ్య ప్రకటనపై వివాదం.. బీజేపీ ఎంపీ అభ్యంతరం

  • సియట్ టైర్ల యాడ్ లో నటించిన ఆమిర్ 
  • వీధుల్లో బాణసంచా కాల్చవద్దని పిలుపు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణాటక ఎంపీ హెగ్డే
  • ముస్లింల నమాజ్ ను కూడా ప్రస్తావించాలని సూచన
  • కంపెనీ ఎండీకి లేఖ రాసిన వైనం 
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన సియట్ టైర్ల యాడ్ పై వివాదం రేగింది. ఆ యాడ్ లో నటుడు ఆమిర్ ... వీధుల్లో టపాసులు కాల్చవద్దని పిలుపునిస్తాడు. అయితే, ఈ వాణిజ్య ప్రకటనపై కర్ణాటక బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. నమాజ్ పేరిట రోడ్లను దిగ్బంధం చేస్తూ, మసీదుల్లో అజాన్ నిర్వహిస్తూ శబ్దకాలుష్యం సృష్టించేవారిని కూడా సియట్ తమ వాణిజ్య ప్రకటనలో ఉద్దేశించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు హెగ్డే సియట్ ఎండీ, సీఈఓ అనంత్ వర్ధన్ గోయెంకాకు లేఖ రాశారు.

ఇలాంటి వాణిజ్య ప్రకటనలతో హిందువుల్లో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. సియట్ సంస్థ భవిష్యత్తులో హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు హెగ్డే పేర్కొన్నారు.

"వీధుల్లో బాణసంచా కాల్చరాదంటూ అమీర్ ఖాన్ తో సందేశం ఇప్పించడం బాగుంది. ప్రజా సంబంధ అంశాలపై మీ శ్రద్ధ అభినందనీయం. కానీ, అదే సమయంలో ముస్లింలు నమాజ్ ల పేరిట శుక్రవారాల్లో రోడ్లపైనే ప్రార్థనలు నిర్వహించడం, వారు నిర్వహించే కొన్ని పండుగలను కూడా మీరు ప్రస్తావించాలని కోరుతున్నాం. రోడ్లపై నిర్వహించే నమాజ్ ల కారణంగా అంబులెన్సుల వంటి అత్యవసర సర్వీసులకు తీవ్రం ఆటంకం ఏర్పడుతుంది. ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి" అని హెగ్డే తన లేఖలో పేర్కొన్నారు.


More Telugu News