జగన్ ను పట్టాభి అనకూడని మాట అన్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

  • కోట్లాది మంది అభిమానించే జగన్ ను దుర్భాషలాడారు
  • పట్టాభి చేత మాట్లాడించింది చంద్రబాబే
  • పట్టాభి వాడిన పదం ఉత్తరాదిన ఒక బూతు మాట
తెలుగుదేశం పార్టీ నేతల భాష రోజురోజుకు దిగజారిపోతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మీడియా సమావేశంలో కావాలనే టీడీపీ నేత పట్టాభి పరుష పదజాలాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. కోట్లాది మంది అభిమానించే సీఎం జగన్ ను దుర్భాషలాడారని విమర్శించారు. మాట్లాడింది పట్టాభి అయినా... మాట్లాడించింది టీడీపీ అధినేత చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబుతో చర్చించిన తర్వాతే పట్టాభి పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారని దుయ్యబట్టారు.  

పట్టాభి చాలా ఘోరంగా మాట్లాడిన తర్వాతే వైసీపీ అభిమానుల నుంచి రియాక్షన్ వచ్చిందని సజ్జల అన్నారు. ఇకపై కూడా అర్థంపర్థం లేకుండా పరుషమైన వ్యాఖ్యలు చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుందని చెప్పారు. గత రెండున్నరేళ్లుగా సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలకు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని... అది తట్టుకోలేకే టీడీపీ నేతలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే బూతులు మాట్లాడటమా? అని ప్రశ్నించారు. తాము కూడా పట్టాభి వాడిన భాషనే వాడితే పరిస్థితి ఎలా ఉంటుందని అడిగారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టినా తాము సంయమనాన్ని పాటిస్తామని చెప్పారు.

పట్టాభి ఒకే పదాన్ని పలుమార్లు వాడటం వెనకున్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఆయన వాడిన పదం ఉత్తర భారతంలో ఒక బూతు మాట అని... ఎవరూ అనకూడని మాట అని అన్నారు. నిస్పృహతో గత 6 నెలలుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.


More Telugu News