బుద్ధిజం పర్యాటకం మరింత బలోపేతం.. ఖుషీనగర్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

  • ఎన్నో ఏళ్ల ఆశయాల ఫలితమే ఈ ఎయిర్ పోర్టు
  • వ్యాపారం, ఉపాధి కల్పనకూ దోహదం
  • బుద్ధిజం ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
బుద్ధిజం పర్యాటకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఖుషీనగర్ ఎయిర్ పోర్ట్ దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గౌతమబుద్ధుడి ‘మహాపరినిర్వాణం’ ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ లోనే జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఇవాళ ఆ ఎయిర్ పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఎన్నో ఏళ్ల ఆశయాలు, ప్రయత్నాల ఫలితమే ఖుషీనగర్ విమానాశ్రయమని అన్నారు. ఖుషీనగర్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించాక తన ఆనందం రెండింతలైందని చెప్పారు. పూర్వాంచల్ ప్రజల ఆశయాల సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఖుషీనగర్ ఎయిర్ పోర్ట్ కేవలం ఎయిర్ కనెక్టివిటీని పెంపొందించడమేగాకుండా.. వ్యాపారాలను సృష్టించి ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదం చేస్తుందని మోదీ తెలిపారు.

బుద్ధుడితో అనుసంధానమైన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. బౌద్ధ భక్తులకు మెరుగైన వసతులను కల్పించడంతో పాటు ప్రయాణ అనుసంధానతనూ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఎయిరిండియాను టాటాలకు అమ్మడం ద్వారా విమానయాన రంగానికి మంచి లాభం కలుగుతుందని తెలిపారు.


More Telugu News