యాదాద్రి ఆలయానికి కేసీఆర్ కుటుంబం ఒక కిలో 16 తులాల బంగారం విరాళం.. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ

  • మార్చి 21న 108 కుండాలతో మహా సుదర్శన యాగానికి అంకురార్పణ
  • ఆ తర్వాతి నుంచి స్వయంభూ దర్శనం
  • సిద్దిపేట ప్రజల తరపున మంత్రి హరీశ్ రావు కిలో బంగారం విరాళం
  • 5 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించిన హెటిరో డ్రగ్స్
  • 200 ఎకరాల్లో యాగం, దేశం నలుమూలల నుంచి వేలాదిమంది రుత్విక్కులు
యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించాలని చినజీయర్ స్వామి నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి వారం రోజుల ముందు అంటే మార్చి 21న 108 కుండాలతో మహా సుదర్శన యాగానికి అంకురార్పణ జరుగుతుంది. ఆ తర్వాతే ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నిన్న యాదాద్రిని దర్శించుకున్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.

ఈ మహా క్రతువులో 1.50 లక్షల కిలోల నెయ్యిని వినియోగిస్తామని, దేశంలోని వివిధ ప్రసిద్ధ క్షేత్రాలు, వైష్ణవ పీఠాధిపతులు, అమెరికా తదితర దేశాల నుంచి అర్చకులు, ఐదారువేలమంది రుత్విక్కులు, వారి సహాయకులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని, కాబట్టి కొండ దిగువన ఉన్న 200 ఎకరాల్లో యాగం నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు.

చినజీయర్ స్వామి హైదరాబాద్ సమీపంలోని తన ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని, ఒకే సమయంలో రెండు అతిపెద్ద క్రతువులు నిర్వహించడం అంత సులభం కాదని అన్నారు. కాబట్టే మహాకుంభ సంప్రోక్షణ‌ను మార్చి 28న నిర్వహించాలని నిర్ణయించినట్టు వివరించారు.

తిరుమల తరహాలో యాదాద్రి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయాలని నిర్ణయించామని, ఇందుకోసం మొత్తం  125 కిలోల బంగారం అవసరమవుతుందని చెప్పారు. ఈ పవిత్ర కార్యక్రమానికి తమ కుటుంబం తరపున కిలో 16 తులాల బంగారం ఇస్తామని ప్రకటించారు. అలాగే, చినజీయర్ స్వామి పీఠం నుంచి కిలో, మంత్రి మల్లారెడ్డి కుటుంబం కిలో, మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరపున కిలో, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి తన వస్త్ర సంస్థల తరపున రెండు కిలోలు, కావేరి సీడ్స్ అధినేత భాస్కర్‌రావు కిలో, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు కిలో బంగారం చొప్పున ఇస్తారని కేసీఆర్ వెల్లడించారు.

బంగారు తాపడానికి రూ. 65 కోట్ల వరకు ఖర్చవుతుందని అన్నారు. ఈ మహత్ కార్యంలో ప్రతి గ్రామం భాగస్వామి కావాలని అన్నారు. రిజర్వు బ్యాంకు నుంచి 125 కిలోల స్వచ్ఛమైన బంగారం కొని తాపడానికి ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గోదావరి నీళ్లతో స్వామిని అభిషేకిస్తామని వివరించారు. ఒకేసారి వెయ్యి కుటుంబాలు బస చేసేలా వెయ్యి ఎకరాల్లో 250 కాటేజీలు నిర్మిస్తామని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడం కోసం ముఖ్యమంత్రి కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించిన కాసేపటికే 22 కిలోల బంగారం విరాళంగా సమకూరింది.

హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారం విరాళంగా ప్రకటించగా, సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరపున కిలో బంగారం ఇస్తానని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అలాగే, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, కడప జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడం జయమ్మ ఒక్కో కిలో చొప్పున బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.


More Telugu News