టీడీపీ కార్యాలయాలపై దాడులను ఖండించిన పవన్ కల్యాణ్, రఘురామకృష్ణ రాజు

  • టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు
  • ఇలాంటి దాడులు గతంలో లేవన్న పవన్
  • ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదని వ్యాఖ్య  
  • డీజీపీ వెంటనే స్పందించాలన్న రఘురామ
  • దాడులను దమనకాండతో పోల్చిన సోము వీర్రాజు
ఏపీలో టీడీపీ కార్యాలయాలు, ఇళ్లపై నేడు జరిగిన దాడులను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖండించారు.

దీనిపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జనసేన ఐటీ వింగ్ కు సంబంధించిన సమావేశంలో ఉండగా రాష్ట్రంలో టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగినట్టు సమాచారం అందిందని తెలిపారు. తనకు తెలిసినంతవరకు రాష్ట్రంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరగడం ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. ఇలాంటి దాడుల సంస్కృతి ప్రజాసంక్షేమానికి ఏమాత్రం క్షేమకరం కాదని స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసులపైనా, నాయకుల ఇళ్లపైనా దాడులు చేస్తే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారితీస్తుంది తప్ప, అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదని పవన్ అభిప్రాయపడ్డారు.

దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించాలని పవన్ కోరారు. ఏపీ పోలీసు విభాగం కూడా సత్వరమే దీనిపై చర్యలు తీసుకోవాలని, దోషులను పట్టుకుని శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి చిరునామాగా మారుతుందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలే ఇవాళ్టి దాడులకు పాల్పడ్డట్టు చెబుతున్నారని, భవిష్యత్తులో ఇలాంటి ధోరణులను వైసీపీ నేతలు నియంత్రించుకోకపోతే ప్రజాస్వామ్యానికి అది గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

ఇక, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ... టీడీపీ కార్యాలయాలపైనా, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైనా దారుణరీతిలో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దాడికి పాల్పడినవారు పట్టాభి కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా దూషించినట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఈ దాడులకు కారకులు ఏ పార్టీకి చెందినవారైనా సరే డీజీపీ తక్షణమే చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. నేతల మీద, పార్టీ కార్యాలయాల మీద ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి భంగకరం అని తెలిపారు.

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు విషాదకరం అని అభివర్ణించారు. ఇటువంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై జగన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని ఏపీ బీజేపీ తరఫున డిమాండ్ చేశారు.


More Telugu News