ఇదంతా చంద్రబాబు కుట్ర: మంత్రి అవంతి శ్రీనివాస్

  • ఏపీలో నేడు వాడీవేడి రాజకీయ పరిస్థితులు
  • పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ ఆగ్రహం
  • స్పందించిన అవంతి
  • అలజడులు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న అవంతి
నేడు రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. సీఎం జగన్ సంక్షేమ పాలన పట్ల ఓర్వలేకపోతున్నారని అన్నారు. టీడీపీ నేతల తీరు దిగజారిందని విమర్శించారు.

రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, వారిలో టీడీపీ వాళ్లు లేరా అని అవంతి ప్రశ్నించారు. తాము పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పాలన చేపడుతున్నామని స్పష్టం చేశారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన అని చూడకుండా అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చామని, కానీ టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేయించి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

"ఏవైనా రాజకీయాలు ఉంటే మీకు, మాకు మధ్యనే ఉన్నాయి... ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎందుకు అడ్డుతగులుతున్నారు? ప్రజలకు అందజేసే మంచి పథకాలపై మన విభేదాలను రుద్దడం ఎందుకు?" అని అవంతి ప్రశ్నించారు.

"రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఏదైనా కానీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుంది. ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంలో విధానపరమైన లోపాలు ఉంటే మీడియా ముందుకు వచ్చి సభ్యతా సంస్కారాలతో విమర్శించండి. ఏవైనా లోపాలు ఉంటే తప్పకుండా సరిచేసుకునే ప్రభుత్వం మాది" అని అవంతి స్పష్టం చేశారు.


More Telugu News