కమీషన్ల కోసమే పోలవరం లోపల మరో ఎత్తిపోతల పథకం: చంద్రబాబు ఆరోపణ

  • టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం
  • జగన్ అజ్ఞాని అంటూ విమర్శలు
  • ప్రజలకు అప్పులు, జగన్ బినామీలకు ఆస్తులు అంటూ వ్యాఖ్యలు
  • బినామీ సంస్థల్లో వేల కోట్ల నల్లధం ఉందని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ... జగన్ అజ్ఞానంతో సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని కమీషన్లకు కక్కుర్తిపడి అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు. కమీషన్లకు ఆశపడి పోలవరం లోపల మరో ఎత్తిపోతల పథకం అంటున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజలకు అప్పులు, జగన్ బినామీలకు ఆస్తులు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాంకీ, హెటెరో సహా అనేక బినామీ కంపెనీల్లో వేలకోట్ల మేర నల్లధనం ఉందని అన్నారు.

డ్రగ్స్, కల్తీ మద్యంతో జాతి నిర్వీర్యం అవుతోందని పేర్కొన్నారు. గంజాయి, హెరాయిన్ స్మగ్లర్లే రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్నారని తెలిపారు. పాడేరు ఏజెన్సీలో గంజాయితో డ్రింకులు, ఐస్ క్రీములు, చాక్లెట్లు తయారుచేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలోని ఇతర అంశాలపైనా చంద్రబాబు స్పందించారు. రెండున్నరేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం పడిందని వివరించారు. ప్రజారక్షక పోలీస్ వ్యవస్థ కాస్తా ప్రజా భక్షక వ్యవస్థగా మారిందని విమర్శించారు. ఇంద్రకీలాద్రి, తిరుమలలో అన్యమత ప్రచారం దుర్మార్గం అని పేర్కొన్నారు. విమానాల్లో వాడే ఇంధనం కంటే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయని వెల్లడించారు. ఆరు దశల్లో పరిశీలన పేరుతో రాష్ట్రంలో పెన్షన్, రేషన్ కార్డుల్లో కోత విధిస్తున్నారని ఆరోపించారు.


More Telugu News