మేం మాట తప్పితే మీరు ఊరుకుంటారా?: హుజూరాబాద్ లో హరీశ్ రావు

  • హుజూరాబాద్ నియోజకవర్గంలో హరీశ్ ప్రచారం
  • గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని విజ్ఞప్తి
  • ఈటలపై విమర్శనాస్త్రాలు
  • ఈటలను గెలిపిస్తే బీజేపీకి లాభమని వ్యాఖ్యలు
హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరఫున మంత్రి హరీశ్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీ వరకు ఎన్నికల వాతావరణం ఉంటుందని, ఆ తర్వాత కూడా సీఎంగా కేసీఆరే ఉంటారని, ఆర్థికమంత్రిగా తానే ఉంటానని అన్నారు.

రాష్ట్రంలో పనిచేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, టీఆర్ఎస్ నే గెలిపించాలని అన్నారు. గెలిస్తే ఏం చేస్తామో చెప్పామని, మేం ఇచ్చిన హామీలు తప్పితే మీరు ఊరుకుంటారా? అని హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను తీవ్రంగా విమర్శించారు. మంత్రిగా పనిచేయని వ్యక్తి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనిచేస్తాడా? అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు ఈటల ఒక్క ఇల్లయినా కట్టించాడా? అని నిలదీశారు.

"ఈటల ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలి. వైద్య కళాశాల కావాలని రాజీనామా చేశారా? లేక జిల్లా కోసం రాజీనామా చేశారా?" అంటూ హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈటలను గెలిపిస్తే బీజేపీ లాభపడుతుందే తప్ప ప్రజలకు దక్కేదేమీ ఉండదని, గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే ప్రజలకే లాభం అని స్పష్టం చేశారు. ఈటలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.


More Telugu News