గోవాలో లిక్కర్ మ్యూజియం... దేశంలోనే ప్రథమం

  • ఫెనీ మద్యానికి గోవా ప్రసిద్ధి
  • స్థానికంగా జీడిమామిడితో తయారీ
  • ఘాటైన రుచితో ఆకట్టుకునే ఫెనీ
  • ఫెనీ తయారీ ఉపకరణాలతో మ్యూజియం
గోవా అత్యంత ప్రముఖ పర్యాటక స్థలం అని తెలిసిందే. భారత్ వచ్చే విదేశీయుల్లో అత్యధికులు గోవాను తప్పక సందర్శిస్తుంటారు. గోవా సంస్కృతి కూడా పాశ్చాత్యదేశాల సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. కాగా, గోవాలో తాజాగా ఓ లిక్కర్ మ్యూజియం ఏర్పాటైంది. లిక్కర్ కు మ్యూజియం ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం. నందన్ కుచాద్కర్ అనే స్థానిక వ్యాపారవేత్త ఈ మ్యూజియం నెలకొల్పాడు. ఉత్తర గోవాలోని కండోలిమ్ గ్రామంలో ఈ మ్యూజియాన్ని చూడొచ్చు.

గోవాలో స్థానికంగా ఫెనీ అనే మద్యాన్ని తయారుచేస్తారు. జీడిమామిడి ఫలాల నుంచి తయారుచేసే ఫెనీ మద్యం ఎంతో పేరుగాంచింది. ఒకరకంగా ఫెనీ మద్యం గోవాకు వారసత్వ సంపద వంటిదని చెప్పాలి. అందుకే ఈ మ్యూజియంలో ఫెనీ తయారీకి ఉపయోగించే వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఫెనీ మద్యం నిల్వకు ఉపయోగించే భారీ పాత్రలు కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి.

నందన్ కుచాద్కర్ కు పురాతన కళాఖండాల సేకరణ ఓ హాబీ. దాంతో వందల ఏళ్ల నాటి ఫెనీ తయారీ ఉపకరణాలను కూడా సేకరించి ఈ మ్యూజియంలో ఉంచారు. దీనిపై నందన్ కుచాద్కర్ స్పందిస్తూ... ఇలాంటి ఓ మ్యూజియం స్థాపించాలన్న ఆలోచన రాగానే, ప్రపంచంలో ఇలాంటిది ఇంకెక్కడైనా ఉందా అని యోచించినట్టు తెలిపారు. స్కాట్లాండ్, రష్యా దేశాల్లో ప్రజలు తమ వద్ద ఉన్న మద్యాన్ని సంతోషంగా ప్రదర్శిస్తుంటారని, కానీ ఓ మ్యూజియాన్ని లిక్కర్ కోసం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం అని వెల్లడించారు.

మ్యూజియం సీఈఓ అర్మాండో డువార్టే మాట్లాడుతూ, గోవాలో అతిథులు వచ్చినప్పుడు మద్యంతో విందు సంప్రదాయమని తెలిపారు. ఇక, ఓ పర్యాటకుడు ఇక్కడి మ్యూజియాన్ని సందర్శించిన అనంతరం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మద్యం గురించి ఇక్కడ పొందుపరిచిన సమాచారం అద్భుతమని పేర్కొన్నాడు.


More Telugu News