ఉత్తరాఖండ్ కు ఐఎండీ రెడ్ అలర్ట్... బద్రీనాథ్ యాత్ర నిలిపివేత
- రాబోయే మూడ్రోజుల్లో అతి భారీ వర్షాలు
- అప్రమత్తమైన ప్రభుత్వం
- అధికారులు సన్నద్ధంగా ఉండాలన్న సీఎం
- యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్న చమోలీ కలెక్టర్
ఉత్తరాఖండ్ లో రాబోయే మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం పుష్పర్ సింగ్ ధామీ ఆదేశించారు. ఈ క్రమంలో చమోలీ జిల్లా అధికారులు నేటి బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు. యాత్రికులు అందరూ జోషి మఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చమోలీ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.